: ఎటూ కదలక స్థిరంగా నిలిచిన స్టాక్ మార్కెట్

గడచిన కొన్ని సెషన్లుగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకొచ్చి, గత వారం చివరి నుంచి అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లిపోయిన బెంచ్ మార్క్ సూచికలు, ఈ రోజు కూడా అదే తీరును కొనసాగించాయి. సెషన్ ఆరంభం నుంచి క్రితం ముగింపునకు అటూ ఇటుగా సాగిన సూచికలు అత్యధిక సమయం నష్టాల్లోనే సాగాయి. చివరి గంట వ్యవధిలో వచ్చిన కొనుగోలు మద్దతు సెన్సెక్స్, నిఫ్టీలను సోమవారం నాటి స్థాయికి తీసుకు వచ్చాయి. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 1.06 పాయింట్లు పడిపోయి 0.001 శాతం నష్టంతో 26,395.71 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 1.75 పాయింట్లు తగ్గి 0.02 శాతం నష్టంతో 8,108.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.18 శాతం, స్మాల్ కాప్ 0.54 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 23 కంపెనీలు లాభపడ్డాయి. ఎస్బీఐ, సిప్లా, అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, అల్ట్రా సిమెంట్స్, జడ్ఈఈఎల్, బీపీసీఎల్, అంబుజా సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,661 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 952 కంపెనీలు లాభాలను, 1,546 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 99,42,196 కోట్లకు చేరుకుంది.

More Telugu News