: ఆఫ్గన్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన ఒర్లాండో ముష్కరుడి తండ్రి

ఒమర్ మతీన్... అమెరికాలోని ఓర్లాండోలోని గే క్లబ్ పై దాడి చేసి 50 మందిని పాశవికంగా హత్య చేసిన ఉన్మాది. అతని తండ్రి సిద్దిఖ్ మతీన్ అలియాస్ మీర్ సిద్ధిఖీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆఫ్గనిస్థాన్ లో పుట్టి పెరిగిన ఆయన, ఆ దేశ అధ్యక్ష పదవిని అధిరోహించాలని కలలు కన్నాడట. అమెరికాకు వచ్చి స్థిరపడక ముందు ఆయన పొలిటికల్ టీవీ షోలనూ నిర్వహించాడు. మతీన్ పేరిట ఉన్న యూట్యూబ్ చానల్ లో ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఆఫ్గన్ లోని తాలిబాన్లకు ఆయన అనుకూలుడని తెలుస్తోంది. ఒక వీడియోలో "వజీరిస్థాన్ లోని మన యుద్ధ సోదరులు, తాలిబాన్ సోదరులు రోజురోజుకూ బలపడుతున్నారు" అని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. "ఇన్షా అల్లా... సమస్యలు తొలగిపోతాయి. దురంద్ సరిహద్దు వివాదం (పాశ్తన్ ప్రాంతంలో దశాబ్దాలుగా ఆఫ్గన్, పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు రేఖ వివాదం) మనకు అనుకూలమవుతుంది" అని కూడా అన్నారు. 1983 ప్రాంతంలో ఆయన కరుడుగట్టిన తాలిబాన్ అనుకూలుడని ఇప్పుడు తెలుసుకున్న ఎఫ్బీఐ ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతని సెల్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉన్నట్టు 'వాషింగ్టన్ పోస్ట్' ప్రకటించింది.

More Telugu News