: ఆర్బీఐ గవర్నర్ ఎంపికకూ కమిటీ... పాత విధానానికి స్వస్తి చెప్పిన మోదీ సర్కారు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఎంపిక ఇకపై కేవలం ప్రధానమంత్రి మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. ఇక నుంచి గతేడాది ఏర్పాటైన ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్ మెంట్ సెర్చ్ కమిటీ (ఎఫ్ఎస్ఆర్ఏఎస్సీ) ఇందులో కీలక పాత్ర పోషించనుంది. తొలుత ఆర్బీఐ గవర్నర్ పోస్టు పట్ల ఆసక్తి చూపుతున్న ఆర్థిక వేత్తల దరఖాస్తులను పరిశీలించనున్న ఈ కమిటీ... ఎంపిక చేసిన కొద్దిమంది పేర్లతో జాబితాను ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీకి పంపుతుంది. ఈ కమిటీ సూచించిన ఆర్థికవేత్తల్లోని ఓ వ్యక్తిని ఆర్బీఐ గవర్నర్ గా కేబినెట్ నియమిస్తుంది. ఈ మేరకు దేశంలో తొలిసారిగా ఈ ఏడాది ఆర్బీఐ గవర్నర్ ఎంపికకు ఈ కమిటీ రంగంలోకి దిగుతోంది. కేబినెట్ సెక్రటరీ పికే సిన్హా నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రభుత్వ శాశ్వత నామినీగా పీఎంఓ అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా ఉంటారు. ఇక ప్రభుత్వంతో సంబంధం లేని మరో ముగ్గురు నిపుణులు కూడా ఈ కమిటీలో ఉంటారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చికి చెందిన రాజీవ్ కుమార్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కు చెందిన మనోజ్ పండా, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన బిమల్ ఎన్ పటేల్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే సెబీ చైర్మన్ ఎంపికకు సంబంధించిన కసరత్తు చేసింది. తాజాగా ఆర్బీఐ గవర్నర్ ను ఎంపిక చేసే కీలక బాధ్యతలను ఈ కమిటీ చేపట్టనుంది.

More Telugu News