: మీరు సెన్సార్ చేయకండి... సర్టిఫికేట్ ఇవ్వండి!: 'ఉడ్తా పంజాబ్' వివాదంలో సెన్సార్ బోర్డుకు బాంబే హైకోర్టు అక్షింతలు

'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం ప్రారంభమైన నాటి నుంచి సెన్సార్ బోర్డు విమర్శలు ఎదుర్కొంటోంది. నేడు ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు... 'అసలు మీ పని ఏంటి? మీరు ఏం చేస్తున్నారు?' అంటూ నిలదీసింది. సెన్సార్ బోర్డు పని సినిమాను సెన్సార్ చేయడమా? సర్టిఫికేట్ ఇవ్వడమా? అని అడిగింది. కష్టపడి తీసిన సినిమాను మీరు సెన్సార్ చేయడమేంటని ప్రశ్నించింది. 'మీరు సర్టిఫికేట్ ఇవ్వండి చాలు' అని హితవు పలికింది. మీరిచ్చిన సర్టిఫికేట్ ను బట్టి సినిమా చూడాలో వద్దో ప్రజలే నిర్ణయించుకుంటారని, ఆ స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వాలని తెలిపింది. సినిమాలో మరీ ఎక్కువగా డ్రగ్స్ చూపించారనుకుంటే కట్ లు ఎందుకు? ఏకంగా సినిమాను ఎందుకు నిషేధించలేదని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. కాగా, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, చాలా సీన్లు అసభ్యంగా ఉన్నాయని, ఓ కుక్కపేరు జాకీ చాన్ అని పెట్టారని వాటిని తొలగించాలని సూచించామని సెన్సార్ బోర్డు న్యాయస్థానానికి తెలిపింది. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ ఈ సినిమాను కావాలనే నిలిపేస్తున్నారని యూనిట్ వాదించింది. దీనిపై తుది తీర్పును ఈ నెల 13న వెల్లడించనున్నట్టు బాంబే హైకోర్టు తెలిపింది. కాగా, ఈ సినిమాను 17 న విడుదల చేయాలని యూనిట్ గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News