: అంజూ జార్జిపై క్రీడా మంత్రి వేధింపులు!... కేరళ సీఎంకు ఫిర్యాదు చేసిన అథ్లెట్!

దేశం గర్వించదగ్గ ప్రముఖ అథ్లెట్ అంజూ బీ జార్జీకి కేరళ క్రీడా శాఖ మంత్రి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ప్రోత్సహించాల్సిన క్రీడా శాఖ మంత్రి నుంచే వేధింపులు ఎదురవడంతో షాక్ తిన్న అంజూ... విషయాన్ని నేరుగా కేరళ సీఎం పినరయి విజయన్ కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే... కేరళ క్రీడల మండలి అధ్యక్షురాలిగా అంజూ చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊమెన్ చాందీ సర్కారు దిగిపోగా... పినరయి విజయన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో విజయన్ కేబినెట్ లో క్రీడా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన ఈపీ జయరామన్ ను అంజూ జార్జి మండలి సభ్యులతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జార్జి బృందాన్ని విపక్షానికి మద్దతుదారులుగా ముద్ర వేసిన జయరామన్... తన నుంచి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత మండలి కార్యకలాపాల నిమిత్తం ఇటీవల బెంగళూరు వెళ్లిన అంజూ విమానంలో కేరళకు చేరుకుంది. దీనికి సంబందించిన బిల్లులను మంజూరు చేయకపోవడంతో పాటు అంజూ అవినీతికి పాల్పడుతోందని జయరామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడా శాఖ మంత్రి వరుస వేధింపులతో మనసు నొచ్చుకున్న అంజూ నేరుగా విజయన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అంజూ వాదనను పూర్తిగా విన్న విజయన్ దీనిపై తాను పరిశీలన చేసి చర్యలు తీసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చారు.

More Telugu News