: పూలకూ వడదెబ్బ... పూల పరిమళాల్లో తేడాలు!

ఏటికేడాది పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం మనుషులపైనే కాకుండా ప్రకృతిలో భాగమైన పూలపై కూడా పడుతున్నాయి. ఈ ఎండల ధాటికి పూలు పరిమళాలు వెదజల్లడంలో తేడాలు వస్తున్నాయని హీబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెం పరిశోధకులు తెలిపారు. వీరు చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పలు రకాల జాతులకు చెందిన పూలపై వివిధ ఉష్ణోగ్రతల్లో పీహెచ్ డీ విద్యార్థులు పరిశోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వాటిలో పరిమళాలు వెదజల్లే శక్తిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడాన్ని వారు గుర్తించారు. కాగా, పూలు పరిమళాలు వెదజల్లడం ద్వారా కీటకాలను ఆకర్షించి పరాగసంపర్కం చేయడం ద్వారా తమ జాతిని పెంచుకుంటూపోతాయన్న సంగతి తెలిసిందే. మరి పరిమళాలు వెదజల్లడం మానేస్తే... పరాగసంపర్కం ఆగిపోయి ఆ జాతి మొక్కలు అంతరించిపోతాయని వారు వెల్లడించారు. ఇది ప్రమాదానికి సంకేతమని వారు తెలిపారు. కాగా, మారుతున్న ఉష్ణోగ్రతలు పెను ప్రమాదానికి సూచికలని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News