: అవకాశాల గని మా దేశం... మీ దేశంలో అభివృద్ధి బ్రహ్మాండం: ఖతార్ లో మోదీ

ఇండియాలో వ్యాపారం చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తన విదేశీ పర్యటనలో భాగంగా ఖతార్ లో పర్యటిస్తున్న ఆయన, ఈ ఉదయం అక్కడి వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. "మా దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను స్వయంగా మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చాను. పెట్టుబడులతో భారత్ కు వచ్చి మంచి లాభాలను అందుకోండి. అనుమతుల విషయంలో కొన్ని సందేహాలు మీకున్నాయని నాకు తెలుసు. వాటన్నింటినీ పరిష్కరిస్తాము" అని ఖతార్ వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఖతార్ లో అభివృద్ధి బ్రహ్మాండమని, ప్రభుత్వ పనితీరు, అధికారుల బాధ్యత అన్ని దేశాలకూ ఆదర్శనీయమని మోదీ కొనియాడారు. ఇరు దేశాల వ్యాపార సంబంధాల వృద్ధిలో అధికారులదే కీలక పాత్రని తెలిపారు. ఆకర్షణీయ నగరాలు, మెట్రో రైళ్లు వంటి సదుపాయాలతో ఇండియాలో ప్రజల జీవన విధానం మెరుగుపడిందని చెప్పారు. ఇండియాలోని 80 కోట్ల మంది యువత తమ బలమని, వారికి అపార నైపుణ్యముందని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల విస్తృతి, తయారీ రంగాలను బలోపేతం చేయడమే తమ తదుపరి ప్రాధాన్యతలని తెలిపారు. ఇండియాలోని ఆగ్రో, రైల్వే, సోలార్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరారు.

More Telugu News