: బ్యాంకులకు ఇవ్వాల్సిన రూ. 4.5 వేల కోట్లు చెల్లించలేము: తేల్చిచెప్పిన జేపీ అసోసియేట్స్

జేపీ గ్రూప్ లోని ప్రధాన సంస్థగా ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ సంస్థ, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 4,539 కోట్లను తిరిగి చెల్లించే పరిస్థితిలో లేమని సంచలన ప్రకటన చేసింది. రూ. 2,905 కోట్ల అసలును, రూ. 1,558 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయామని వెల్లడించింది. మౌలిక రంగంలో నెలకొన్న మాంద్యం కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 3,240 కోట్లను నష్టపోయామని పేర్కొంది. ఇదే సమయంలో తమకు ఆదాయం రూ. 8,794 కోట్లని తెలిపింది. కాగా, గత కొంతకాలంగా వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకువెళ్లలేకపోయామన్న జేపీ గ్రూప్, తాము నిర్వహిస్తున్న 17.2 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న సిమెంట్ ఫ్యాక్టరీని ఆదిత్యా బిర్లా గ్రూప్ నిర్వహిస్తున్న అల్ట్రాటెక్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ. 15,900 కోట్లు కాగా, ఇంకా లావాదేవీ పూర్తి కాలేదు. ఇక ఇప్పుడు జేపీ చేతుల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లలో 10.6 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న సిమెంట్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. గ్రూప్ లోని మరో సంస్థ జేపీ పవర్ సైతం, తాము నిర్వహిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టును రూ. 9,300 కోట్లకు జేఎస్ డబ్ల్యూ ఎనర్జీకి విక్రయించింది. కాగా, బ్యాంకులకు రుణాలను చెల్లించడానికే చూస్తామని, తమకింకా సమయం ఉందని జేపీ చైర్మన్ మనోజ్ గౌర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఫార్ములా వన్ రేస్ కోర్సు ట్రాక్ నిర్మాణానికి కాంట్రాక్టు పొందిన నాటి నుంచి, ఆ ప్రాజెక్టుకు నిధుల సమీకరణలో విఫలమైన సంస్థ నష్టాల్లోకి జారి పోయిన సంగతి తెలిసిందే. గడచిన రెండేళ్లలో దాదాపు రూ. 22 వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించింది.

More Telugu News