: 'మా నాన్న రెడ్ లైట్ దూకించాడు' అంటూ 911కు ఫోన్ చేసి పట్టించిన ఆరేళ్ల బుడుగు

వాహనంలో వెళుతున్నప్పుడు సిగ్నల్స్ వద్ద గ్రీన్ లైట్ వెలుగుతుంటేనే వెళ్లాలి. పసుపు రంగు వెలుగుతుంటే కారును స్లో చేయాలి. ఎరుపు రంగు వెలుగుతుంటే కారును ఆపేయాలి. చిన్నప్పటి నుంచి రిచర్డ్ సన్ తెలుసుకుంటున్నది, చూస్తున్నదీ ఇదే. అమెరికాలోని బోస్టన్ లో వుండే రిచర్డ్ సన్ కిండర్ గార్టెన్ చదువుతున్న ఆరేళ్ల బుడ్డోడు. తన తండ్రి మైఖేల్ రిచర్డ్ సన్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ వెలుగుతుంటే కారును పోనిచ్చాడని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు ఇల్లు చేరగానే తండ్రిని పట్టించాడు. తండ్రితో కలసి కారులో బయటకు వెళ్లిన బుడ్డోడు, ఇంటికి రాగానే బాల్కనీలోకి వెళ్లి 911కు డయల్ చేశాడు. "మీ అత్యవసర పరిస్థితి ఏంటి?" అని అవతలి నుంచి ఫోన్ లిఫ్ట్ చేసిన అధికారి అడిగారు. దీనికి "మా నాన్న రెడ్ లైట్ వెలుగుతుంటే కారును పోనిచ్చారు" అని చెప్పాడు. ఆపై సాధారణంగా నల్లటి ట్రక్ ను నాన్న నడుపుతుంటారని, ఈ సారి అమ్మ నడిపే కొత్త కారును తీసుకు వెళ్లాడని చెప్పాడు. "తరువాత ఏం జరిగింది?"... ఇది అవతలి నుంచి వినిపించిన మరో ప్రశ్న. "మేము కారును వాషింగ్ చేయించాం. ఆ తరువాత కారు రెడ్ లైట్ ను దాటింది" అన్నాడు. మీ నాన్న అలా చేశాడా? అని అడిగితే అవునని చెప్పాడు. ఆయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారా? నేను మాట్లాడవచ్చా? అని అధికారి అడగ్గా, తన తండ్రికి ఫోన్ ఇచ్చాడు. తండ్రితో మాట్లాడిన పోలీసులు జరిమానా విధించారు. ఇక రోజూ తమకెన్నో కాల్స్ వస్తుంటాయని, ఇటువంటివి అరుదని చెబుతూ క్విన్సీ పోలీసులు ఈ సంభాషణను ఫేస్ బుక్ ఖాతాకు జోడించగా, ఇప్పుడది వైరల్. అన్నట్టు ఈ బుడ్డోడు నిత్యమూ పోలీసు కార్లతోనే ఆడుకుంటూ ఉంటాడట. వీడికి పోలీస్ కావాలన్నదే లక్ష్యమట. మరి రూల్స్ పై ఇంత అవగాహన ఉంటే అయిపోడా?

More Telugu News