: అమెరికాలో భార్యను, చదువు చెప్పిన ప్రొఫెసర్ నూ కాల్చిచంపి, ఆత్మహత్య చేసుకున్న భారత ఐఐటీయన్

మైనాక్ సర్కార్ (38)... ఖరగ్ పూర్ లోని ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. ఆపై 2013లో అమెరికాలో డాక్టరేట్ కూడా పొందాడు. ఏం జరిగిందో ఏమో, తన భార్య ఆష్లీ హస్తిని చంపి, ఆపై దాదాపు 3,200 కిలోమీటర్ల దూరాన్ని సొంత కారులో ప్రయాణించి, చదువు చెప్పిన ప్రొఫెసర్ ను హత్య చేసి, ఆపై తనను తాను కాల్చిచంపుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లాస్ ఏంజిల్స్ లో తీవ్ర సంచలనం కలిగించింది. మినసోటాలోని మైనాక్ నివాసంలో తాను చంపాలనుకుంటున్న వారి వివరాలను రాసిపెట్టుకుని మరీ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. యూసీఎల్ఏ (యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్)లో మైనాక్, మెడికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను బోధించే ప్రొఫెసర్ విలియమ్ క్లగ్ వద్ద డాక్టరేట్ చేశాడు. ఇండియా నుంచి వచ్చే విద్యార్థులు క్లగ్ వద్దకు వెళ్లవద్దని, అతను ప్రొఫెసర్ లా ఉండడని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. అతని 'కిల్ లిస్టు'లో మరో ప్రొఫెసర్ పేరు కూడా ఉంది. అయితే, వర్శిటీకి వచ్చేసరికి అతను లేకపోవడంతో, విలియమ్ ను మాత్రమే చంపి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 2011లో ఆష్లీ హస్తితో అతనికి వివాహమైందని, అయితే, వారు ఇప్పటికీ కలిసున్నారా? లేదా? అన్నది తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News