: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లో నిపుణులు అత్యంత కీలకంగా భావించే 8,200 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతును పొందడంలో నిఫ్టీ సూచిక విఫలమైంది. నేటి సెషన్ ఆరంభంలోనే నూతన ఈక్విటీల కొనుగోలుతో 8,200 స్థాయిని పరీక్షించుకున్న నిఫ్టీ, ఆపై అదే స్థాయిలో నిలవలేకపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు లాభల స్వీకరణకే మొగ్గు చూపడంతో ఒడిదుడుకుల మధ్య కిందకు దిగివచ్చి, స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్ ఒక దశలో 26,850 పాయింట్ల వరకూ వెళ్లి వెనక్కు వచ్చింది. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 45.97 పాయింట్లు పెరిగి 0.17 శాతం లాభంతో 26,713.93 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 19.85 పాయింట్లు పెరిగి 0.24 శాతం లాభంతో 8,179.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.3 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.18 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 25 కంపెనీలు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, ఇన్ ఫ్రాటెల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఎస్బీఐ, టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిప్లా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,792 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,321 కంపెనీలు లాభాలను, 1,313 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. 99,29,603 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 99,52,435 కోట్లకు పెరిగింది.

More Telugu News