: వాల్ మార్ట్, గ్యాప్ కంపెనీల్లో దోపిడీ, లైంగిక వేధింపులు... భారతీయ ఉద్యోగుల వెతలు!

ఇండియా, బంగ్లాదేశ్ లోని వాల్ మార్ట్, గ్యాప్ ఫ్యాక్టరీ, హెచ్ అండ్ ఎం తదితర కంపెనీల్లో ఉద్యోగం చేయడం అంటే దోపిడీకి గురవడమేనని ఆసియా ఫ్లోర్ వేజ్ అలయన్స్ అనే రీసెర్చ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. వీరి దగ్గర పనిచేసే వారికి సరైన జీతభత్యాలు లేకపోవడమే కాకుండా, మహిళా కార్మికులపై లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. వీరి భద్రత విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని పేర్కొంది. భారత్, బంగ్లాదేశ్ సహా ఇండోనేషియా, కంబోడియా దేశాల్లోని కార్మికులను ఇంటర్వూ చేసిన ఆసియా ఫ్లోర్ వేజ్ అలయన్స్, ఎన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నా కార్మికులకు న్యాయం జరగడం లేదని వెల్లడించింది. భారత్ లోని 24 వాల్ మార్ట్ సరఫరాదారుల ఫ్యాక్టరీల్లో కార్మికులను కలిసిన ఆసియా ఫ్లోర్ వేజ్, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం లాంటి ఎన్నో వేధింపులను వెలుగులోకి తెచ్చింది. గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లలో ఉన్న వాల్ మార్ట్ సప్లై కంపెనీల్లో 105 కార్మికులను కలిసిన రీసెర్చ్ సంస్థ, కార్మికుల హక్కులకు ఇక్కడ ప్రాధాన్యత లేదని తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో 60 నుంచి 80 శాతం కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారని వెల్లడించింది.

More Telugu News