: ఇటలీలో వివక్షకు గురై నరకయాతన అనుభవించిన ముగ్గురు ఐఐటీయన్లు!

వారు ముగ్గురూ ఇండియాలో ఐఐటీ విద్యను అభ్యసించినవారు. ఒకరు బాంబే ఐఐటీలో, ఇద్దరు ఢిల్లీ ఐఐటీలో చదివారు. తమ రెండో సంవత్సరం విద్య కోసం ఇటలీకి వెళ్లారు. వారాంతాన్ని సరదాగా గడుపుదామని వారు చేసిన ప్రయత్నం వికటించింది. శరీరపు రంగు, విదేశీయులన్న కారణాలతో ఇటలీ సెక్యూరిటీ సిబ్బంది వివక్షను చూపగా, విద్యార్థులు నరకయాతన పడ్డారు. ఇటలీలోని భారత విదేశాంగ శాఖ కల్పించుకున్న ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉదయ్, అక్షిత్, దీపక్ లు ముగ్గురూ స్నేహితులు. ఇటలీలోని ఇన్రియా సోఫియా యాంటీపోలిస్-మెడిటిరాన్స్ లో కంప్యూటర్ సైన్స్ లో ఇంటర్న్ షిప్ చేస్తున్నారు. వారాంతాన్ని పోర్ట్ సిటీ జినోవాలో గడపాలని భావించి అక్కడికి బయలుదేరారు. ఓ కనెక్టింగ్ రైలు కోసం వెంటిమిగ్లియా స్టేషన్ లో వేచి చూస్తున్న వేళ, స్థానిక ఇటలీ సెక్యూరిటీ గార్డులు వారిని చుట్టుముట్టారు. పాస్ పోర్టులు, ఐడెంటిటీ కార్డులు చూపినా వినకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు పాస్ పోర్టులు లేని పలు దేశవాసులను అరెస్ట్ చేసి నిర్బంధించారు. దాదాపు 1,100 కిలోమీటర్ల దూరంలోని బారీకి తీసుకువెళ్లారు. తాము విద్యార్థులమని చెప్పినా వినిపించుకోలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న క్యాంపస్ విద్యార్థులు అధికారుల చర్యను తీవ్రంగా తప్పు పడుతూ నిరసనలు తెలిపారు. జరిగిన ఘటనను వివరిస్తూ, భారత ఎంబసీకి ముగ్గురు విద్యార్థులూ ఫిర్యాదు చేయగా, స్పందించిన అధికారులు విషయాన్ని కౌన్సిల్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లి వారిని విడిపించారు. బుధవారం వీరు తమ ప్రాంతానికి చేరారని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై స్పందించిన కౌన్సిల్ జనరల్ ఉగో సియర్ లతానీ, "నేను ఒక్కటే చెప్పగలను. ఇక్కడ వర్ణ వివక్ష ఏమీ లేదు. నిత్యమూ సిరియా నుంచి పెద్ద సంఖ్యలో వలసవాదులు ఇటలీకి వస్తున్నారు. వారిని అడ్డుకోవాలన్నదే మా ఉద్దేశం" అన్నారు. వీరు పట్టుబడ్డ స్టేషన్ నుంచి బారీకి తీసుకువెళ్లిన అధికారులు, అక్కడ మాత్రమే వీరిని కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించారని తెలుస్తోంది. తమను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు తెలిపారు.

More Telugu News