: ఏడేళ్ల బాలుడిని చిట్టడవిలో విడిచి వెళ్లిన తల్లిదండ్రులు... అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన జపాన్

దారిన వెళుతున్న వారిపై రాళ్లను విసిరాడన్న కోపంతో ఏడేళ్ల బాలుడిని సొంత తల్లిదండ్రులే దట్టమైన అడవిలో వదిలివేయగా, తప్పిపోయిన పిల్లాడి కోసం జపాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తొలుత తమ పిల్లాడు యమాటో తనూకా తప్పిపోయాడని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, ఆపై నిజాన్ని చెప్పారు. జపాన్ పరిధిలోని హొకైడో ప్రాంతంలో ఈ ఘటన జరుగగా, బాలుడు తప్పిపోయిన ప్రాంతంలో క్రూరమైన ఎలుగుబంట్ల సంఖ్య అత్యధికమని అధికారులు తెలిపారు. కుటుంబ సమేతంగా విహార యాత్రకు అడవిలోకి వచ్చిన వారు, యమాటో అల్లరి భరించలేక, తిరిగి వెళ్లే సమయంలో దారి మధ్యలో కారును ఆపి వాడిని దించేశారు. ఓ అరకిలోమీటరు దూరం ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేసరికి యమాటో అక్కడ లేడు. దీంతో వారు కంగారుపడి అధికారులకు సమాచారం ఇచ్చారు. మొత్తం 180 మందికి పైగా పోలీసు ఆఫీసర్లు, స్నిప్ఫర్ డాగ్స్ తో పాటు అశ్వకదళాన్ని రంగంలోకి దించిన జపాన్ ప్రభుత్వం యమాటో ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది. తాను చేసిన పని తన కుమారుడిని ఎన్ని ఇబ్బందులు పెడుతోందోనని యమాటో తండ్రి మీడియా ముందు బోరుమన్నాడు. తల్లిదండ్రుల తీరుపై జపాన్ వాసులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News