: సన్'రైజింగ్' వెనుక 'లక్ష్మణ్'బాణం!

వార్నర్, ధావన్, హెన్రిక్స్, యువరాజ్, హూడా... వీరిలో బీభత్సమైన ఫామ్ లో ఉన్న వారెవరూ లేరు. భారీగా పరుగులు సాధించిన వీరులూ లేరు. శ్రాన్, కుట్టింగ్, హెన్రిక్స్ అద్భుతమైన బౌలర్లేమీ కాదు. కానీ ఈ ఐపీఎల్ సీజనులో వీరందరితో కూడిన హైదరాబాద్ సన్ రైజర్స్ కప్పు కొట్టేసింది. అది కూడా సాధారణమైన జట్టుపై కాదు. కోహ్లీ, గేల్, డెవిలియర్స్, వాట్సన్ వంటి దిగ్గజాలతో ఉన్న రాయల్ చాలెంజర్స్ పై గెలిచి సత్తా చాటారు. వాస్తవానికి ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభంలో సన్ రైజర్స్ కు టైటిల్ దక్కుతుందని ఎవరూ ఊహించి వుండరు. కానీ ఎవరూ అనుకోని విజయాన్ని తన జట్టుకు అందించిందో 'లక్ష్మణ'శక్తి. జట్టుకు వ్యూహకర్తగా ఉంటూ సమష్టిగా ఆడితే విజయం ఖాయమని, ప్రత్యర్థులు ఎంతటి వారైనా భయపడాల్సింది లేదని నిత్యమూ నూరిపోసిన అతనే స్టయిలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్! తమ వెంట మైదానంలో ఓ అదృశ్య శక్తిగా లక్ష్మణ్ నిలిచాడని, అందువల్లే కోహ్లీ, గేల్ విజృంభణ తరువాత కూడా తాము నిలదొక్కుకున్నామని మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ వ్యాఖ్యానించాడు. మైదానం వెలుపల ఆయన కృషి, శ్రమ ఆటలో కీలకంగా పనిచేసిందని, అందువల్లే తాము విజయం సాధించామని చెప్పాడు. ఐపీఎల్ పోటీలు ప్రారంభం కావడానికి రోజుల ముందే జట్టుతో చేరిన లక్ష్మణ్ తన అనుభవాన్నంతా రంగరించి యువ ఆటగాళ్లకు ఒత్తిడి తట్టుకోవడాన్ని నేర్పాడు. చేజారిపోతున్న మ్యాచ్ లో తిరిగి ఎలా పట్టు సాధించవచ్చో చెప్పాడు. తాను స్వయంగా ఆడకపోయినా, ఆటగాళ్లు మైదానం దాటగానే వారిలో ఒకడైపోయేవాడు. ప్రత్యర్థి జట్ల బలాబలాలను అన్వేషిస్తూ, వ్యూహాలను రచించాడు. వాటిని అమలు పరిచే విధానంలో ఆటగాళ్లను సమాయత్తం చేసేవాడు. ఇప్పుడన్నీ ఫలించాయి. ఐపీఎల్ కిరీటాన్ని సన్ రైజర్స్ జట్టు తొలిసారి అందుకుంది. ఈ గెలుపు వెనుక లక్ష్మణ్ కృషి ఎంతైనా అభినందనీయం.

More Telugu News