: 14 టూరిజం హోటళ్లను విక్రయానికి పెట్టనున్న మోదీ సర్కారు!

ఐటీడీసీ (ఇండియన్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో నడుస్తున్న 16 హోటళ్లలో 14 హోటళ్లను విక్రయించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని టూరిజం శాఖ మంత్రి మహేష్ శర్మ తెలిపారు. నష్టాల్లో నడుస్తున్న వీటిని విక్రయించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. ఆర్థిక శాఖ చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా హోటళ్ల విక్రయాలుంటాయని, ఐటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హోటళ్లలో ఢిల్లీలోని అశోకా, సామ్రాట్ మినహా మిగతా 14 హోటళ్లను విక్రయిస్తామని తెలిపారు. కాగా, ఇవి పాట్నా, జమ్ము, రాంచీ, భువనేశ్వర్, పూరి, భోపాల్, భరత్ పూర్, జైపూర్, గువాహతి, మైసూర్, పుదుచ్చేరి, ఇటానగర్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. కాగా, 1999 నుంచి 2004లో వాజ్ పేయి సర్కారు పాలన సాగినప్పుడు ఐటీడీసీ ఆధ్వర్యంలో ఉన్న 34 హోటళ్ల సంఖ్యను 16కు తగ్గించిన సంగతి తెలిసిందే. హోటళ్ల విక్రయాల ద్వారా ఏ మేరకు నిధులను ఖజానాకు చేర్చాలని భావిస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం మహేష్ శర్మ సమాధానం ఇవ్వలేదు.

More Telugu News