: డివిలియర్స్ కంటే కోహ్లీ ఎందుకు బెస్ట్ అంటే...: షేన్ వార్న్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ గొప్ప ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నలుగురూ నాలుగు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు. అయితే 360 డిగ్రీల కోణంలో బంతిని బౌండరీకి దాటించగల డివిలియర్స్ తన కంటే గొప్ప ఆటగాడు అన్న కోహ్లీ వ్యాఖ్యలతో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విభేదించాడు. డివిలియర్స్ కంటే కోహ్లీయే గొప్ప ఆటగాడని చెబుతున్నాడు. డివిలియర్స్ 360 డిగ్రీల కోణంలో బంతిని ఆడగలడన్నది వాస్తవమేనని అన్న వార్న్... కోహ్లీలా డివిలియర్స్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేడని అన్నాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే కోహ్లీ టన్నుల కొద్దీ పరుగులు చేశాడని గుర్తుచేశాడు. అలాగే ఐపీఎల్ లో 919 పరుగులు చేసి అందరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని వార్న్ తెలిపాడు. లక్ష్య ఛేదనలో వందకుపైగా స్ట్రయిక్ రేట్ కలిగిన ఆటగాడు కోహ్లీ అని ఆయన పేర్కొన్నాడు. కాగా, 170 స్ట్రయిక్ రేట్ తో డివిలియర్స్ ఈ టోర్నీలో 682 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లయన్స్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అబ్దుల్లా సాయంతో డివిలియర్స్ ఒంటిచేత్తో గెలిపించిన సంగతి తెలిసిందే.

More Telugu News