: టీడీపీలోకి మరో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!

ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపి ఎమ్మెల్యేలు మరో ఇద్దరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు టీడీపీ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల కార్యకర్తలతో ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో వారిద్దరూ టీడీపీలో చేరుతున్నారన్న అభిప్రాయం మరింత బలపడింది. కాగా, రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చెప్పినప్పటికీ వాళ్లిద్దరూ వెళ్లలేదు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈరోజు ఉదయం తన కుటుంబసభ్యులతో మంతనాలు జరిపారని, ఆ తర్వాత గిద్దలూరు, రాచర్ల మండల పరిషత్ అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిసింది. మిగిలిన మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసిన తర్వాత తాను టీడీపీ లో చేరనున్న విషయాన్ని అశోక్ రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే పోతుల రామారావు తన స్వగ్రామమైన టంగుటూరులో కుటుంబసభ్యులు, పలువురు పెద్దలతో మాట్లాడారని, ఆ తర్వాత తన అనుచరులతో, వర్గీయులతో తాను పార్టీ మారనున్న విషయాన్ని చర్చించారని, అనంతరం ఈరోజు మధ్యాహ్నానికి ఆయన టంగుటూరు చేరుకున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం మహానాడు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విజయవాడలో సీఎం సమక్షంలోనే టీడీపీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

More Telugu News