: మోదీ పాలన 'ఓన్లీ భాషణ్ - నో శాసన్': కాంగ్రెస్ ఎద్దేవా

గడచిన రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలన 'ఓన్లీ భాషణ్ - నో శాసన్' (మాటలు మాత్రమే, చేతలు లేవు) అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కపిల్ సిబల్ తదితరులు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. దేశంలో మార్పును తీసుకువస్తామని హామీలిచ్చి గద్దెనెక్కిన మోదీ, గత రెండేళ్లలో ఏ మార్పూ తేలేకపోయారని నిప్పులు చెరిగారు. "ఏంటిది? గత రెండేళ్ల పాలన అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకోవడానికి ఏముంది? ఉద్యోగాల సృష్టి జరిగిందా? రైతులకు లాభం 50 శాతం పెరిగిందా? దేశంలో ఎక్కడైనా రక్షణ ఉందా?" అంటూ కపిల్ సిబల్ ప్రశ్నల వర్షం కురిపించారు. "కిస్ కా సాథ్?, కహా హై వికాస్?" (వికాసం ఎక్కడ? ఎవరికి దగ్గరైంది?) అని దుయ్యబట్టారు. ప్రతి 45 గంటలకూ ఓసారి కబుర్లు చెప్పే మోదీ, తామడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం కూడా చెప్పలేరని అన్నారు. అంతకుముందు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. "పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఉద్యోగ సృష్టీ అంతంతమాత్రమే. 2 కోట్ల ఉద్యోగాలను వారు హామీ ఇస్తే, కేవలం 1.35 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. కరవు పీడిస్తోంది. రైతులను ఆదుకునేలా ఒక్క చర్యా తీసుకోలేదు" అని ఆయన అన్నారు. తప్పుడు హామీలను కొనసాగిస్తూ, కాలం నెట్టుకొస్తున్నారు తప్ప దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News