: ఫోర్బ్స్ తాజా జాబితా... ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో 56 ఇండియాలోనే

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా 56 భారత కంపెనీలు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో నిలిచాయి. ప్రముఖ బిజినెస్ మేగజైన్ 'ఫోర్బ్స్' వరల్డ్ వైడ్ లార్జెస్ట్ కంపెనీల జాబితాను అందించింది. మొత్తం 2000 ర్యాంకులను ప్రకటించగా, అమెరికాకు చెందిన 586 కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆపై చైనా ఆధిపత్యాన్ని చూపింది. టాప్ 10 కంపెనీల్లో జపాన్ టయోటా మోటార్ మినహా మిగతా అన్నీ యూఎస్, చైనాలవే కావడం గమనార్హం. కాగా, గత సంవత్సరం ఈ జాబితాలో 56 భారత కంపెనీలుండగా, ఈ సంవత్సరం కూడా సంఖ్య మారలేదు. 2015లో 142వ ర్యాంకులో ఉన్న రిలయన్స్ ఈ యేడాది 121వ స్థానానికి మెరుగుపడింది. ఆపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (149), ఓఎన్జీసీ (220), ఐసీఐసీఐ (266), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (275), ఇండియన్ ఆయిల్ (371), టీసీఎస్ (385), ఎన్టీపీసీ (400), భారతీ ఎయిర్ టెల్ (453), యాక్సిస్ బ్యాంక్ (484), ఇన్ఫోసిస్ (590), భారత్ పెట్రోలియం (650), విప్రో (755), టాటా స్టీల్ (1178), అదానీ ఎంటర్ ప్రైజస్ (1993) లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితో పాటు కోల్ ఇండియా, ఎల్అండ్ టీ, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తదితర కంపెనీలకూ స్థానం లభించింది.

More Telugu News