: సాయిరెడ్డి సత్యాన్నే నమ్ముకున్నారు!... అందుకే రాజ్యసభ సీటిచ్చానన్న వైఎస్ జగన్!

ప్రస్తుతం రాజ్యసభ ఖాళీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీలో విపక్ష పార్టీకి దక్కనున్న సింగిల్ సీటుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ నేటి ఉదయం పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ సీటు కోసం పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నా... విజయసాయిరెడ్డికే టికెట్ ఎందుకు ఇచ్చానన్న విషయంపై జగన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. నేటి ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో భేటీ అయిన జగన్... సాయిరెడ్డిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యాన్ని నమ్ముకున్నందునే సాయిరెడ్దికి టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఒకే ఒక్క మాట కోసం వైసీపీ పుట్టుకొచ్చిందని చెప్పిన జగన్... సాయిరెడ్డి విలువలకు కట్టుబడ్డారని చెప్పారు. అక్రమ కేసుల్లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారని ఆయన చెప్పారు. కానీ సత్యాన్ని నమ్ముకున్న సాయిరెడ్డి, వాస్తవాలనే చెప్పారన్నారు. అందుకే తనపై నమోదైన కేసుల్లో సాయిరెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారన్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి, తనకు అండగా నిలిచారన్నారు. విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామనే సంకేతం పంపడానికే సాయిరెడ్డికి టికెట్ ఇచ్చానని జగన్ చెప్పారు.

More Telugu News