: రాజన్ ను పిలిపించి మాట్లాడిన మోదీ... రెండో చాన్స్ దక్కేనా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా రఘురాం రాజన్ ను రెండో దఫా కొనసాగిస్తారా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాజన్ ను పిలిపించుకుని మాట్లాడటం చర్చనీయాంశమైంది. సెప్టెంబరులో పదవీ కాలం ముగియనుండగా, రాజన్ కొనసాగింపును కొందరు కోరుతుండగా, సుబ్రహ్మణ్యస్వామి వంటి కొందరు బీజేపీ నేతలు, ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానిని కలిసేముందు ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీని కూడా రాజన్ కలిసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం వివరాల గురించి మీడియాకు వెల్లడించేందుకు రాజన్ నిరాకరించారు. కాగా, వచ్చే నెల 7వ తేదీన పరపతి సమీక్షను జరపాల్సి వున్నందున క్షేత్ర స్థాయిలో ఆర్థిక పరిస్థితుల గురించి ఆర్బీఐ వద్ద ఉన్న సమాచారాన్ని రాజన్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆపై రాజన్, ప్రధాని మోదీని కలిసి పలు విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది. రాజన్ గ్రీన్ కార్డును పొడిగించుకుంటూ ఇండియాలో ఉంటున్నారని, ఆయన వల్లే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని స్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆయన కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత వెలువడకపోవడంతో కొంత సస్పెన్స్ నెలకొంది.

More Telugu News