: తడబడి, నిలబడి, తడబడిన గుజరాత్...బెంగళూరు లక్ష్యం 159

ఐపీఎల్ సీజన్ 9 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ కు ఆదిలోనే బెంగళూరు బౌలర్లు షాక్ ఇచ్చారు. రెండో ఓవర్లో అబ్దుల్లా.. మెక్ కల్లమ్ (1), ఆరోన్ ఫించ్ (4) ను పెవిలియన్ కు పంపాడు, అనంతరం రైనా (1) ను వాట్సన్ అవుట్ చేశాడు. దీంతో కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ లయన్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం డ్వేన్ స్మిత్ (73) కు జత కలిసిన దినేష్ కార్తిక్ (26) కాసేపు నిలకడగా ఆడాడు. అనంతరం బౌండరీలు, సిక్సర్లతో దూకుడు పెంచిన డ్వెన్ స్మిత్ కుదురుకోవడంతో జోరు పెంచడంలో భాగంగా కార్తిక్ స్విచ్ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. దీంతో నిలకడగా ఆడుతుందనుకున్న జట్టు మరోసారి భారీ కుదుపుకి లోనైంది. ఈ వెంటనే రవీంద్ర జడేజా (3) అవుటయ్యాడు. తరువాత క్రీజులో కుదురుకున్న స్మిత్ కూడా పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో డ్వెన్ బ్రావో (8) కు జత కలిసిన ఏకలవ్య ద్వివేదీ (19) రెండు భారీ సిక్సర్లు కొట్టి ఆశలు రేపాడు. కోహ్లీ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అతను వెనుదిరిగాడు. తరువాత బ్రావో, తరువాతి బంతికే ప్రవీణ్ కుమార్ (1) అవుటయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ధావల్ కులకర్ణి (10) రన్ అవుట్ గా వెనుదిరగడంతో గుజరాత్ జట్టు ఇన్నింగ్స్ 158 పరుగుల వద్ద ముగిసింది. బెంగళూరు బౌలర్లలో వాట్సన్ 4 వికెట్లతో రాణించగా, అబ్దుల్లా, జోర్డన్ చెరో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. వారికి ఒక వికెట్ తీసి చాహల్ సహకారమందించాడు. 159 పరుగుల విజయ లక్ష్యంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది.

More Telugu News