: పాకిస్థాన్ కు 2 వేల కోట్ల సాయం నిలిపేసే దిశగా అమెరికా చర్యలు?

పాకిస్థాన్‌ కు 2 వేల కోట్ల రూపాయల సైనిక సాయం నిలిపివేసే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఈ మేరకు అమెరికా సెనేట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. హక్కానీ ఉగ్రవాద నెట్‌ వర్క్‌ ను అణచివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ రుజువు చేసుకోలేకపోయిన పక్షంలో అమెరికా ఈ సాయం ఆపేయనుంది. పాకిస్థాన్‌ కు సైనిక సాయం అందించడంపై ప్రపంచ దేశాలతోపాటు ఆ దేశ భద్రతాధికారుల హెచ్చరికలను పెడచెవినపెట్టిన అమెరికా విమర్శలను ఎదుర్కొంది. దీంతో పాక్ కు సాయంపై సెనేట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పాక్ అంతర్గత భద్రత, సుస్థిరతతో పాటు సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని అరికట్టడం కూడా చాలా కీలకం అని సెనేట్ అభిప్రాయపడింది. దీంతో గత సంవత్సరం నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టాన్ని ఆమోదించినట్లే ఈసారి కూడా సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. గతేడాది పాక్‌ కు భద్రతాపరమైన సాయం కొనసాగించిన అమెరికా, ఈ ఏడు మాత్రం విశ్వాసం పెంపొందించుకుంటేనే సాయం చేస్తామని సూచించింది. అదే సమయంలో పాక్ లో చైనా సాయంతో పలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇది కూడా అమెరికాకు కంటగింపుగా మారింది.

More Telugu News