: గేల్ కి తొలి షాక్...బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్ట్ రెన్యువల్ కి ససేమిరా!

డబుల్ మీనింగ్ డైలాగులతో దుమారం రేపిన వెస్టిండీస్ క్రికెటర్ గేల్ కు ఝలక్ ఇచ్చేందుకు రెనీగేడ్స్ ఫ్రాంఛైజీ సిద్ధమవుతోంది. గతంలో బిగ్ బాష్ లీగ్ లో 'మందు కొడదాం వస్తావా?' అని యాంకర్ ను అడగడంపై ఆగ్రహించిన బిగ్ బాష్ లీగ్ యాజమాన్యం అతడికి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మారని గేల్ తాజాగా బ్రిటిష్ జర్నలిస్టు చార్లొట్‌ కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాట్లాడి మరో వివాదానికి కారణమయ్యాడు. సభ్యసమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేయడంతో, పురషాహంకారం తగదంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఫ్లింటాఫ్ వంటి సీనియర్లు హితవు పలకడంతో వారిని కూడా చీల్చి చెండాడాడు. దీంతో గేల్ మారే అవకాశం లేదని భావించిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ వచ్చే ఏడాది బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టును పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. అదొక్కటే కాదు. ఇంగ్లిష్ కౌంటీల్లో కూడా గేల్ ను తీసుకోకూడదని భావిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. గేల్ 'బ్యాటు' వ్యాఖ్యలు... రెండు జట్లలో అతనికి అవకాశాలు చేజారిస్తే, సెలెక్టర్లపై నోరు పారేసుకోవడం జాతీయ జట్టులో చోటు కోల్పోయేలా చేసింది. దీంతో ప్రస్తుతానికి గేల్ ఐపీఎల్ కు మాత్రమే ఆడే అవకాశం కనబడుతోంది. బీసీసీఐ కూడా చర్యలకు సిద్ధమయితే గేల్ ఖాళీగా కూర్చోవడం ఖాయం. గతంలోలా గేల్ మళ్లీ క్షమాపణలు చెబుతాడా? లేక అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటాడో చూడాలి. కాగా, విండీస్ లో తన ఇంట్లోనే గేల్ ఓ పబ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే... 'ఈ ఆదాయం సరిపోతుంది. క్రికెట్ తో ఇంకేం పని?' అనుకుంటాడేమో చూడాలి. విండీస్ క్రికెట్ బోర్డు, బిగ్ బాష్, ఇంగ్లిష్ కౌంటీల నిర్ణయం గేల్ కు వచ్చే ఎండార్స్ మెంట్లపై ప్రభావం చూపనుంది. అలా జరిగితే గేల్ కెరీర్ ముగిసినట్టే....గేల్ నోటి దురుసుతనం ఎంత పని చేసింది?

More Telugu News