: మారిన అమేజాన్ రిఫండ్ పాలసీ... ఎలక్ట్రానిక్ వస్తువులు నచ్చకుంటే రీప్లేస్ మెంట్ మాత్రమే, డబ్బు వెనక్కివ్వరు!

మీరు ఈ నెల 11 తరువాత ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ నుంచి టాబ్లెట్, సెల్ ఫోన్, ల్యాప్ టాప్, కెమెరా తదితర ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును కొనుగోలు చేశారా? వస్తువు నచ్చకుంటే వెనక్కు తిరిగి ఇచ్చేసి, మీరు చెల్లించిన డబ్బును తిరిగి వెనక్కు తీసుకునే సదుపాయం ఇక లేదని మీకు తెలుసా? ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై రిఫండ్ పాలసీని మారుస్తూ, అమేజాన్ నిబంధనలను మార్చింది. ఇందులో భాగంగా కేవలం వస్తువు రీప్లేస్ మెంట్ మాత్రమే ఉంటుంది తప్ప, నగదు రిఫండ్ సౌకర్యం లభించదు. మీరు కొత్త వస్తువు నాణ్యతాలోపం ఉందనిగానీ, లేదా డ్యామేజ్ అయిన వస్తువు చేతికందిందని గానీ నిరూపించగలిగితేనే ఉచిత రీప్లేస్ మెంట్ లభిస్తుంది. ఈ నిర్ణయం ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చినట్టని అమేజాన్, తన వెబ్ సైట్ లో ఓ ప్రకటన ఉంచింది. ఇక ఏ వస్తువును కొనుగోలు చేసినా, లోపాలపై 10 రోజుల్లోనే ఫిర్యాదు చేయాలి. ఆపై ఫిర్యాదు చేసినా వస్తువును వెనక్కు తీసుకోరు సరికదా... రీప్లేస్ మెంట్ సౌకర్యం కూడా లభించదు. కాగా, ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి సంస్థలు దాదాపు ఇదే తరహా రిఫండ్ పాలసీని అమలు చేస్తున్నాయి. ఇతర సంస్థల పాలసీలను సమీక్షించిన తరువాతనే, తాము విధానాన్ని మార్చినట్టు అమేజాన్ పేర్కొంది. అయితే, స్నాప్ డీల్ లో వస్తువు డ్యామేజ్ అయితే, కస్టమర్ రీప్లేస్ మెంట్ లేదా రిఫండ్ ను కోరుకోవచ్చు. వస్తువు బాగుంటే మాత్రం ఇవి వర్తించవు. ఇక మిగిలిన చిన్న సంస్థలు సైతం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విషయంలో ఇదే విధానానికి రానున్నాయని తెలుస్తోంది.

More Telugu News