: మీరు నాకు నీతులు చెప్పొద్దు: విండీస్ క్రికెటర్ గేల్

మీరా, నాకు నీతులు చెప్పేది? అంటూ వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ 'బిగ్ బాష్' లీగ్ సందర్భంగా తను చేసిన వ్యాఖ్యలను విమర్శించిన సీనియర్లపై మండపడ్డాడు. బిగ్‌ బాష్ లీగ్ (బీబీఎల్) లో తన ప్రవర్తనను తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లపై గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇయాన్ చాపెల్, క్రిస్ రోజర్స్, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ లపై విరుచుకుపడ్డాడు. తన జీవిత కథగా రాబోతున్న 'సిక్స్ మెషీన్-ఐ డోన్ట్ లైక్ క్రికెట్...ఐ లవ్ ఇట్’ పుస్తకంలో వారిపై పదునైన వ్యాఖ్యలతో మండిపడ్డట్టు తెలుస్తోంది. ఈ పుస్తకంలోని కొన్ని కామెంట్లను గేల్ తాజాగా వెల్లడించాడు. క్రికెట్ ఆడేటప్పుడు వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాప్ తనకు నీతులు చెప్పడమేంటని ప్రశ్నించాడు. ఒక యువ క్రికెటర్ తరహాలో ఫీల్ అయ్యే ఫ్లింటాఫ్..తనకు ఉపన్యాసాలు ఇవ్వొద్దని హెచ్చరించాడు. ఫ్లింటాప్ ఎప్పుడు బంతి వేసినా పాస్ట్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ లైన్ దాటుతుందని (అతని బౌలింగ్ లో పసలేదని) అన్నాడు. గతంలో ఫీల్డ్ లో చురుగ్గా ఉండేందుకు వయాగ్రా మాత్రలు తీసుకుంటానని ఫ్లింటాఫ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో మనిద్దరం బార్లలో కలిసి గడిపిన క్షణాలు మర్చిపోయావా? అంటూ ఆసీస్ క్రికెటర్ క్రిస్ రోజర్స్ ను గేల్ ప్రశ్నించాడు. 'నువ్వు ఏమి మాట్లాడావో నాకు తెలుసు. ఈసారి మాట్లాడేటప్పుడు క్యారెట్ నములుతూ మాట్లాడు' అని ఎద్దేవా చేశాడు. ఇక ఆసీస్ మాజీ దిగ్గజం ఇయాన్ చాపెల్ ను కూడా వదల్లేదు. గతంలో వెస్టిండీస్ లో ఒక క్రికెట్ అధికారిని కొట్టి దోషి అయిన ఇయాన్ చాపెల్ తనను నిషేధించాలనడం సిగ్గు చేటని మండిపడ్డాడు. తనపై నిషేధం విధించమనడానికి చాపెల్ ఎవరని గేల్ నిలదీశాడు.

More Telugu News