: మురళీ విజయ్, గురుకీరత్ ల అర్ధ శతకాలు వేస్ట్... ధోనీ గెలిచాడు

ఐపీఎల్‌ సీజన్‌ 9ను రైజింగ్‌ పుణె సూపర్‌ జైయింట్స్‌ చిరస్మరణీయమైన విజయంతో ముగించింది. విశాఖపట్టణం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు మురళీ విజయ్ (59), గురుకీరత్ సింగ్ మాన్ (51), హషీమ్ ఆమ్లా (30) రాణించడంతో 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ను కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (64 నాటౌట్‌) భారీ షాట్లతో అభిమానులను అలరిస్తూ, జట్టును 4 వికెట్ల తేడాతో గెలిపించాడు. మ్యాచ్ చివర్లో ఆరు బంతుల్లో 23 పరుగులు అవసరమైన దశలో మురళీ విజయ్ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ను రంగంలోకి దించాడు. దీంతో ధోనీ తన దైన శైలిలో అక్షర్ పటేల్ పై తన హెలికాప్టర్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాది జట్టుకు విజయం అందించాడు. ఈ రెండు జట్లు అట్టడుగు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. నాలుగు విజయాలతో పంజాబ్ అట్టడుగు స్థానాన్ని దక్కించుకోగా, ఐదు విజయాలు సాధించిన పూణే దాని తరువాతి స్థానంలో నిలిచింది. దీంతో ఈ సీజన్ లో ఈ రెండు జట్ల పోరాటం ముగిసింది.

More Telugu News