: అతి పొడ‌వైన పిజ్జా... గిన్నిస్ రికార్డ్‌ కొట్టింది!

వంద‌ మందికి పైగా చెఫ్‌లు ఇటలీలోని నేపుల్స్‌లో ఒక్క‌చోట చేరారు. రెండు వేల కిలో గ్రాముల పిండి, 1,600కిలో గ్రాముల ట‌మాటాలు, రెండు వేల కిలోగ్రాముల ఫైరోడిలేట్ చీజ్, రెండొంద‌ల లీట‌ర్ల ఆలివ్ ఆయిల్ తెచ్చారు. ఇంకేముంది, వాటితో ప్ర‌పంచంలో కెల్లా అతి పెద్ద పిజ్జాను త‌యారు చేసేసి, గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశారు. ఈ పిజ్జాను త‌యారు చేయ‌డానికి 11గంట‌లు శ్ర‌మించారు. రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన‌ ఈ ఈవెంట్ ను గిన్నీస్ వ‌రల్డ్ రికార్డ్స్ నిర్ణేత‌ల్లో ఒక‌రైన‌ లూసియా సినిగ‌గ్లైసీ ఆధ్వర్యంలో చేశారు. గ‌తంలో 1595.45 మీట‌ర్ల పొడ‌వుతో ఇటలీలోని మిలాన్‌ ఎక్స్‌పోలో చేసిన పిజ్జా రికార్డును తాజాగా 1853.88 మీటర్ల పొడ‌వుతో చేసిన ఈ పిజ్జా బద్దలు కొట్టేసింది. లూసియా సినిగ‌గ్లైసీ ఈ పిజ్జాయే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పిజ్జా అని చెప్పేయగానే, వారంతా కేరింతలు కొడుతూ పిజ్జాను కోసుకొని తినేశారు. అయితే, 1853.88 మీటర్ల పొడ‌వైన పిజ్జా కదా.. చాలా భాగం మిగిలిపోయింది. అలా మిగిలిన భాగాన్ని అక్కడి స్వచ్ఛంద సంస్థలకి అందజేసి ఆకలితో బాధపడుతున్న వారికి ఇవ్వమని చెప్పారు నిర్వాహకులు.

More Telugu News