: వచ్చేసిన టిమ్ కుక్... తొలి అడుగు ముంబై సిద్ధి వినాయక ఆలయంలోకి!

ఐటీ, మొబైల్ దిగ్గజం యాపిల్ ఇన్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ భారత పర్యటన ప్రారంభమైంది. ముంబైలో దిగిన ఆయన తొలి అడుగులు ప్రముఖ సిద్ది వినాయక ఆలయం వైపు వెళ్లాయి. ఈ ఉదయం ఆయన విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు వెళ్లగా, ఆలయ కమిటీ స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, తాను హైదరాబాద్ వెళ్లి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను కలవనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. రేపు హైదరాబాద్ చేరుకునే కుక్, ఈ పర్యటనలో భాగంగా, ఇక్కడ యాపిల్ ఫోన్ల మాన్యుఫాక్చరింగ్ సెంటరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే యూఎస్ బయట యాపిల్ సంస్థ నెలకొల్పే తొలి టెక్నాలజీ సెంటరుకు భాగ్యనగరి ఆతిథ్యమిచ్చినట్టు అవుతుంది. కాగా, స్పెషల్ ఎకనామిక్ జోన్ లో భాగంగా సుమారు 2,500 మందికి ఉపాధిని కల్పించేలా భారీ సెంటర్ ను సైతం ఆయన ఎనౌన్స్ చేస్తారని సమాచారం. ఆపై ఢిల్లీ వెళ్లే టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. ఇండియాలోని యాపిల్ స్టోర్లను సందర్శించి అమ్మకాలు సాగుతున్న వివరాలను సైతం తెలుసుకుంటారని యాపిల్ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News