: అమ్మకాల ఒత్తిడితో తగ్గిన లాభం!

సెషన్ ఆరంభం నుంచే భారీ లాభాల్లో సాగి ఓ దశలో క్రితం ముగింపుతో పోలిస్తే 300 పాయింట్లకు పైగా లాభంలో ఉన్న సెన్సెక్స్, మధ్యాహ్నం తరువాత లాభాల స్వీకరణకు గురైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో లాభం తగ్గిపోయింది. చిన్న, మధ్య తరహా కంపెనీలు ఒత్తిడిలో సాగాయి. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన వివరాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను కొంతమేరకు నిలిపాయని, అసోంలో మోదీ సర్కారు రానుందన్న వార్తలతో సంస్కరణల అమలు వేగవంతం అవుతుందన్న ఆలోచనలో ఇన్వెస్టర్లు ఉన్నారని నిపుణులు వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 120.38 పాయింట్లు పెరిగి 0.47 శాతం లాభంతో 25,773.61 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 7,890.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.13 శాతం, స్మాల్ కాప్ 0.19 శాతం లాభపడ్డాయి. ఇక, ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ, అరవిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,786 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,304 కంపెనీలు లాభాలను, 1,304 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 97,22,598 కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 97,47,662 కోట్లకు పెరిగింది.

More Telugu News