: మాల్యా నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా!... ఆరు బ్యాంకులకు నోటీసులు

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసమంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం నుంచి వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... సదరు నిధులను విదేశాలకు తరలించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ... ఈ దిశగా చేస్తున్న దర్యాప్తులో భాగంగా తన ముందు హాజరుకావాలని మాల్యాకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులను మాల్యా అంతగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన ఈడీ... మాల్యా పాల్పడ్డ నేరాన్ని నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మాల్యా కంపెనీల నుంచి నిధులు విదేశాలకు తరలిన వైనం, విదేశాల నుంచి మాల్యా కంపెనీల్లోకి నిధులు వచ్చిన పడిన వైనంపై వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ తరహా వివరాలన్నింటినీ తన ముందు పెట్టాలంటూ ఈడీ ఆరు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది.

More Telugu News