: నిరాహార దీక్షకు దిగిన '24' సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా

బెంగళూరులో '24 ' సినిమా విడుదల రోజే పైరసీ జరగడంపై ఆ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. చెన్నైలో నిరాహార దీక్షకు కూర్చున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రముఖ డిజిటల్ సినిమా ప్రొవైడర్ క్యూబ్ జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమా చట్టవిరుద్ధంగా బెంగళూరులోని పీవీఆర్ ఓరియన్ మాల్ లో మే 6 న 9.45 గంటలకు షో (విడుదలైన మొదటి రోజు) సమయంలో రికార్డు చేయబడిందని తెలిపారు. ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా తాము దీనిని గుర్తించామని ఆయన వెల్లడించారు. ప్రతి థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్ ద్వారా ఇలా గుర్తించడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే సినీ పరిశ్రమకు నష్టం చేసిన వారమవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పైరసీకి వ్యతిరేకంగా సినీ పరిశ్రమ మొత్తం కదిలి దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. అందుకే నిన్న సాయంత్రం నుంచి నిరాహార దీక్షలో ఉన్నానని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చిందని, తనతో కలిసి వస్తే, పైరసీని అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ స్పందించి, సరైన చర్యలు చేపట్టేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News