: దేశప్రధానినే 'ఎవరు మీరు?' అని ప్రశ్నించింది... 'ఈ ట్రైన్ లో పని చేసేవాడిని' అని నవ్వుతూ సమాధానమిచ్చిన ప్రధాని... ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచారంలో ముచ్చట!

సర్వభోగాలు అనుభవించే రాజకీయ నేతలను ఎన్నికలు తీవ్ర ఇబ్బంది పెడతాయి. ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ నాయకులు చేయని గిమ్మిక్కులు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇది కేవలం భారత్ లోని రాజకీయ నాయకులకే కాదు. ప్రపంచంలోని ప్రతి దేశంలోని రాజకీయనాయకులకు వర్తిస్తుంది. జూలై 16న జరగనున్న ఎన్నికల కోసం ఆస్ట్రేలియా ప్రధాని మాల్కొల్మ్ టర్న్ బుల్, ప్రతిపక్షనేత బిల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. నేరుగా ప్రజలతో మమేకమవుతూ ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో పలు సందర్భాల్లో వారు కంగుతింటున్నారు. తాజాగా ప్రధాని మాల్కొల్మ్ టర్న్ బుల్ ప్రజలతో మమేకం కావాలని భావించి ఓ లోకల్ ట్రైన్ ఎక్కారు. డోర్ దగ్గరున్న ఆయన ట్రైన్ ఎక్కుతున్న సీనియర్ సిటిజన్ దంపతులను 'రండి రండి' అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. బావున్నారా? అని అడిగారు. దానికి ఆమె సమాధానమిస్తూ, 'నేను బానే ఉన్నాను. ఇంతకీ మీరెవరు?' అని ఎదురు ప్రశ్నించింది. బిత్తరపోయిన ప్రధాని వెంటనే తేరుకుని, నేను ట్రైన్ లో పని చేసే ఉద్యోగిని అని నవ్వుతూ సమాధానమిచ్చి అక్కడి నుంచి కదిలారు. అయితే, ఆమెకు ఆ తర్వాత తెలిసింది, ఆయన తమ ప్రధానమంత్రి గారు అన్న సంగతి!

More Telugu News