: మాల్యాను తిప్పి పంపలేం!... భారత్ కు తేల్చిచెప్పిన బ్రిటన్!

17 బ్యాంకులకు రూ.9 వేల కోట్లను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... సేఫ్ జోన్ కే చేరినట్టున్నారు. మాల్యాను దేశానికి రప్పించేందుకు సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లతో పాటు సుప్రీంకోర్టు కూడా చేసిన యత్నాలు ఇప్పటిదాకా ఫలించలేదు. సుప్రీంకోర్టు, ఈడీ, సీబీఐ నోటీసులను అంతగా పట్టించుకోని మాల్యా... ఇప్పుడప్పుడే భారత్ కు రాలేనని బాహాటంగానే తేల్చి చెప్పారు. అయితే మాల్యాను ఎలాగైనా భారత్ కు రప్పించాలన్న దిశగా చర్యలు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి తాజాగా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. ఇప్పటికే మాల్యా పాస్ పోర్టును రద్దు చేసిన కేంద్రం... మాల్యాను భారత్ కు పంపాలని బ్రిటన్ కు లేఖ రాసింది. ఈ లేఖపై కాస్తంత ఆలస్యంగా స్పందించిన బ్రిటన్... తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను భారత్ కు తిప్పి పంపలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు బ్రిటన్ నుంచి వచ్చిన లేఖను ఆ దేశ హైకమిషన్ కేంద్రానికి అందజేసింది. దీంతో మాల్యా తనకు తానుగా భారత్ వస్తే తప్పించి... ఆయనను దేశానికి రప్పించడం అంత సులువు కాదని తేలిపోయింది.

More Telugu News