: ఆసియా మార్కెట్ల స్ఫూర్తితో కొనసాగిన లాభాలు!

సెషన్ ఆరంభంలోనే నష్టాల్లోకి జారినప్పటికీ, మధ్యాహ్నం తరువాత ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలతో నూతన కొనుగోళ్లు వెల్లువెత్తడంతో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచికలు లాభాలను కొనసాగించాయి. ఒకదశలో క్రితం ముగింపుతో పోలిస్తే, 60 పాయింట్లకు పైగా నష్టంలో ఉన్న సెన్సెక్స్, ఒంటి గంట తరువాత లాభాల్లోకి వచ్చింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 83.67 పాయింట్లు పెరిగి 0.33 శాతం లాభంతో 25,772 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 21.75 పాయింట్లు పెరిగి 0.28 శాతం లాభంతో 7,887.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.20 శాతం, స్మాల్ కాప్ 0.11 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 26 కంపెనీలు లాభపడ్డాయి. గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, లార్సెన్ అండ్ టూబ్రో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టాటా మోటార్స్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,764 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,277 కంపెనీలు లాభాలను, 1,334 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. సోమవారం నాడు రూ. 97,09,079 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 97,14,365 కోట్లకు పెరిగింది.

More Telugu News