: బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొడితే నడివీధికే... అంగీకరించిన ఆర్బీఐ!

బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలను తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా ఉన్నవారి జాబితాను బహిర్గతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమేనని తెలిపింది. తొలి దశలో రూ. 5 కోట్లు అంతకుమించి రుణాలను తీసుకుని వాటిని ఎగ్గొట్టిన వారి పేర్లను వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి వచ్చిన సూచకు స్పందిస్తూ, వీరంతా రుణాలను ఎలా తిరిగి చెల్లించగలరన్న విషయాన్నీ పరిశీలిస్తామని, దానికన్నా ముందు బ్యాంకుల రుణ మంజూరు విధానాన్ని పర్యవేక్షిస్తామని తెలిపింది. కోర్టులు సైతం రుణ ఎగవేతదారుల జాబితాలను కోరుతున్నాయని, ఇక దీన్ని దాచి ప్రయోజనం లేదని ఆర్బీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తొలుత రుణ ఎగవేతదారుల జాబితాను బయటకు ఇస్తే, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని సుప్రీంకోర్టులో వాదించిన ఆర్బీఐ చివరకు దిగిరాక తప్పలేదు. బ్యాంకుల వద్ద నిరర్థక రుణాల మొత్తం పెరిగిపోతున్న నేపథ్యంలో, వీటి మంజూరు తదితరాంశాలను తామే స్వయంగా పరీక్షిస్తామని ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐకి తాఖీదులు రావడంతో, దానికి సమాధానమిచ్చిన ఆర్బీఐ, పూర్తి డేటాబేస్ ను దశలవారీగా బహిర్గతం చేసేందుకు సిద్ధమేనని తెలిపింది. ఈ డేటా బయటకు వస్తే, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వారి పేర్లు నడివీధిలో నిలవడం ఖాయం.

More Telugu News