: రసకందాయంలో క్రూడ్ వార్... సౌదీకన్నా తగ్గింపు ధరకు ఇరాన్ ముడిచమురు

ఒపెక్ దేశాల మధ్య కొనసాగుతున్న ముడిచమురు యుద్ధం రసకందాయంలో పడింది. రెండు నెలల క్రితం వరకూ బ్యారల్ ముడిచమురు ధర 25 డాలర్ల దిగువకు చేరి, ప్రస్తుతం 40 డాలర్లకు పైగా సాగుతున్న వేళ, పెరిగిన 50 శాతం ధరను సాధ్యమైనంతగా అందిపుచ్చుకోవాలని భావిస్తున్న ఇరాన్, తాము సౌదీ కన్నా తక్కువ ధరకు ముడి చమురును విక్రయిస్తామని తెలిపింది. వాస్తవానికి సౌదీ కన్నా ఇరాన్ చౌకగా క్రూడాయిల్ ను విక్రయిస్తున్నప్పటికీ, 2007-08 నాటి ఆర్థికమాంద్యంతో పోలిస్తే, అప్పుడిచ్చిన డిస్కౌంట్ కన్నా అధిక డిస్కౌంటును ఇప్పుడు అందిస్తామని ఇరాన్ చెబుతోంది. జూన్ ఓఎస్పీ (అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్)లో అతిపెద్ద డిస్కౌంటును ప్రకటించి, ఎవరికి చమురు కావాలో చెప్పాలని ఇరాన్ కోరింది. గడచిన జనవరి నుంచి ఇరాన్ మార్కెట్ ధరను సవరించడం ఇది మూడోసారి. జూన్ ఓఎస్పీని ఒమన్ / దుబాయ్ ధరతో పోలిస్తే బ్యారల్ కు 1.60 డాలర్లు తక్కువకు ఇస్తామని ఇరాన్ మంగళవారం నాడు ప్రకటించింది. ప్రస్తుతం బ్యారల్ క్రూడాయిల్ కు సౌదీ రేటుతో పోలిస్తే 30 సెంట్లు తక్కువకే అందిస్తున్న ఇరాన్ ఏకంగా 1.30 డాలర్ల తక్కువ ధరను ప్రకటించింది. అందుబాటులోని గణాంకాల ప్రకారం, 2007 తరువాత ఇరాన్ ఇంత ఎక్కువ డిస్కౌంటును ప్రకటించడం ఇదే తొలిసారి. కాగా, దేశంలో అంతర్యుద్ధం కారణంగా నిధులు అడుగంటిపోతున్న సమయంలో ఇండియా, చైనా వంటి చమురు దిగుమతి దేశాలను మరింత దగ్గర చేసుకునేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News