: డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిచ్చేది లేదు: తేల్చి చెప్పిన జెబ్ బుష్

అమెరికా అధ్యక్షబరిలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ ఖాయమని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఆయనకు అవరోధంగా నిలబడుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సోదరుడైన జెబ్ బుష్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన ట్రంప్ కు మద్దతివ్వడం లేదని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష స్థానానికి డొనాల్డ్ ట్రంప్ సరైన అభ్యర్థి అని తాను భావించడం లేదని ఆయన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడికి సవాళ్లను స్వీకరించగలిగే తెగువ, వినయం, మానవత్వం, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థైర్యం ఉండాలని ఆయన సూచించారు. అలాంటివేవీ ట్రంప్ లో లేవని ఆయన స్పష్టం చేశారు. అసలు ట్రంప్ స్థిరమైన సభ్యుడు కాదని ఆయన పేర్కొన్నారు. సౌత్ కరొలినా సెనెటర్ లిండ్సే గ్రహం, జాన్ మెక్ కెయిన్ తదితరులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. టెక్సాస్ గవర్నర్ రిక్ పెర్రీ, బాబ్ డోలే ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. దీంతో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నిక టాప్ సెలక్షన్ కమిటీలో చీలకతెచ్చేలా కనబడుతోంది.

More Telugu News