: జహీర్ ఖాన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్న బీసీసీఐ

ఫాం లేమి, గాయాల కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయి, పునరాగమనం చేయకుండానే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ పేసర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ కు ఐపీఎల్ ముగిసిన వెంటనే బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించనుంది. టీమిండియా గత కొంత కాలంగా బౌలింగ్ కోచ్ కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. సీనియర్ ఆశిష్ నెహ్రా జట్టుతో ఉన్నప్పటికీ గతంలోలా భారత బౌలింగ్ బలంగా కనిపించడం లేదు. దీంతో మంచి బౌలింగ్ కోచ్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా టీమిండియాకు కపిల్ దేవ్ , మనోజ్ ప్రభాకర్ తరువాత జవగళ్ శ్రీనాధ్, వెంకటేశ్ ప్రసాద్, ఆ తరువాత జహీర్ ఖాన్ స్థిరంగా రాణించగా, ఆశిష్ నెహ్రా, యూసఫ్ పఠాన్, ఆర్పీ సింగ్, శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, వరుణ్ ఆరోన్, ధావల్ కులకర్ణి, అశోక్ ధిండా, ఉమేష్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా ఇలా పేసర్లు జట్టులోకి రావడం ఫాం లేమి, గాయాల కారణంగా జట్టు నుంచి బయటకి పోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియాకు బలమైన బౌలింగ్ కోచ్ కావాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ ను కోచ్ గా నియమించాలని గంగూలీ సూచించాడు. దీంతో బీసీసీఐ ఐపీఎల్ పూర్తి కాగానే టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియమించనుంది. కాగా, గంగూలీ కెప్టెన్సీలోనే జహీర్ టీమిండియాకు ఆటగాడిగా అరంగేట్రం చేయడం విశేషం.

More Telugu News