: బీజేపీ మిత్ర ధర్మం మరిచింది...ప్రత్యేకహోదాపై ఆశలు ఆవిరయ్యాయి: జేసీ

బీజేపీ మిత్ర ధర్మం మరిచిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా వచ్చే అవకాశం లేదని, ఆశలన్నీ ఆవిరయ్యాయని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం ఎంత మందిని కలవాలో, ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేశామని ఆయన చెప్పారు. కేంద్రంలో బీజేపీకి బొటాబొటీ మెజారిటీ ఉండి ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా వచ్చి ఉండేదని ఆయన అన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో, 36 మంది ఎంపీలు పోయినా వచ్చిన నష్టం ఏమీ లేదని భావించి, ఏపీకి మొండి చెయ్యి చూపించారని ఆయన అన్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అంతా చెబుతున్నారని, కేంద్ర మంత్రులను కలిశాం, నీతి ఆయోగ్ ను కలిశాం, వినతి పత్రాలిచ్చాం, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఎన్నోసార్లు వారిని కలిసి చెప్పాం. ఇవి కాకుండా ఇంకా ఎలా ఒత్తిడి పెంచాలని ఆయన ప్రశ్నించారు. తమ రాజీనామాలతో స్పెషల్ స్టేటస్ వస్తుందని అంటే టీడీపీకి చెందిన 16 మంది తక్షణం రాజీనామాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రత్యేకహోదా కావాలని సామాన్య ప్రజానీకానికి ఉందని, వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనబడుతుందని ఆయన తెలిపారు.

More Telugu News