: కింకర్తవ్యం!... సీనియర్ మంత్రులతో మోదీ, కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ!

వీవీఐపీల సేవల కోసం అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో చోటుచేసుకున్న కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యూపీఏ హయాంలో జరిగిన ఈ కొనుగోళ్లతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికాయి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం అధికార పక్షం ఆరోపణలను తిప్పికొట్టేందుకు వ్యవహరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ... తన పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరోవైపు ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీని మరింత సంకట స్థితిలోకి నెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేటి ఉదయం తన కేబినెట్ లోని సీనియర్ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ తదితరులు హాజరయ్యారు. ఇరు వర్గాల భేటీతో నేటి పార్లమెంటు సమావేశాల్లో పెద్ద చర్చే జరగనున్నట్లు సమాచారం.

More Telugu News