: చంద్రబాబు సర్కారుకు షాకిచ్చిన క్రిసిల్!... ఏపీ ట్రాన్స్ కో బాండ్లకు ‘డిఫాల్ట్’ రేటింగ్ ఇచ్చిన వైనం!

మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో. ఇప్పటికే రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపీకి తాజాగా ప్రముఖ రేటింగ్ సంస్థ ‘క్రిసిల్’ మరో షాకిచ్చింది. ఏపీ ట్రాన్స్ కో గతంలో జారీ చేసిన బాండ్లకు ఆ సంస్థ ‘డి’ రేటింగ్ ఇచ్చింది. ‘డి’ రేటింగ్ అంటే...క్రిసిల్ జాబితాలో ఏపీ ట్రాన్స్ కో డిఫాల్టర్ సంస్థగా మారినట్టే. వివరాల్లోకెళితే... రాష్ట్ర విభజన తర్వాత నిధుల సమీకరణ కోసం ఏపీ ట్రాన్స్ కో బాండ్లను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం హామీ ఇవ్వగా, ట్రాన్స్ కో నిధులు సమకూర్చుకుంది. ఈ బాండ్లకు క్రిసిల్ సంస్థ నిన్నటిదాకా ‘బి’ రేటింగ్ ను కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ఈ బాండ్ల మెచూరిటీ తీరినా... ట్రాన్స్ కో డిపాజిట్లను చెల్లించే పరిస్థితి లేదని క్రిసిల్ తేల్చేసింది. దీంతో ట్రాన్స్ కో బాండ్లకు కొనసాగిస్తున్న ‘బి’ రేటింగ్ ను క్రిసిల్ ఉన్న పళంగా ‘డి’కి తగ్గించేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ బాండ్లకు క్రిసిల్ ‘డిఫాల్ట్’ రేటింగ్ ఇవ్వడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమమవుతోంది.

More Telugu News