: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లాడెన్ కంపెనీ!... వేతనాల కోసం కంపెనీపై కార్మికుల దాడి

ఆల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబానికి చెందిన నిర్మాణ రంగ కంపెనీ ‘సౌదీ బిన్ లాడెన్ గ్రూప్ (ఎస్బీజీ)’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ముస్లింల పవిత్ర నగరం మక్కా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీని లాడెన్ తండ్రి ప్రారంభించగా, ప్రస్తుతం అతడి సోదరుడు దీనిని నిర్వహిస్తున్నాడు. సౌదీ అరేబియా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దాదాపుగా 70 శాతం పనులను ఈ కంపెనీనే చేపడుతోంది. ఈ క్రమంలో సౌదీకి చెందిన 12,000 మందితో పాటు వివిధ దేశాలకు చెందిన 77 వేల మంది కార్మికులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. మక్కా మసీదులో క్రేన్ కూలిన దుర్ఘటన నేపథ్యంలో ఎస్బీజీకి సర్కారీ కాంట్రాక్టులు దక్కడం లేదు. అదే సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనం కావడంతో సౌదీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ కారణంగా ఆ ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు నిలిపివేసింది. ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో ఎస్బీజీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. తన వద్ద పనిచేస్తున్న దాదాపు లక్ష మంది కార్మికులకు ఆ సంస్థ నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. ఇప్పటికే ఆ వేతన బకాయిలు 660 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో గత శనివారం కంపెనీలో పనిచేస్తున్న విదేశీ కార్మికుల్లో కొంత మంది ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని రోడ్డెక్కారు. కంపెనీకి చెందిన ఏడు బస్సులకు నిప్పుపెట్టారు. దీంతో మక్కాలోని సదరు కంపెనీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల నిరసనలపై ఘాటుగా స్పందించిన ఎస్బీజీ... విదేశీ కార్మికుల్లోని దాదాపు సగం మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంపై మిగిలిన కార్మికుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వెరసి ఒసామా బిన్ లాడెన్ బతికుండగా... అగ్రగామి కంపెనీగా ఓ వెలుగు వెలిగిన ఎస్బీజీ... తాజాగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది.

More Telugu News