: అచ్చెన్నకు మెచ్చుకోలు!... కొల్లు, పీతలకు అక్షింతలు!

టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా సత్తా చాటుతున్నారు. తనకు కేటాయించిన కార్మిక శాఖపై పట్టు సాధించిన అచ్చెన్న ఆ తర్వాత ఆ శాఖ నిర్వహణను గాడిలో పెట్టారు. ఈ మేరకు నిన్న జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబునాయుడు... అచ్చెన్నను మెచ్చుకున్నారు. కార్మిక శాఖ పనితీరు తనకు బాగా నచ్చిందని పేర్కొన్న చంద్రబాబు... మిగిలిన మంత్రులు కూడా తమ శాఖలపై పట్టు సాధించాలని సూచించారు. కేబినెట్ భేటీ తర్వాత జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతలకు చంద్రబాబు అక్షింతలు వేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయాలు సాగుతున్నాయన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫిర్యాదుతో స్పందించిన చంద్రబాబు... పరిస్థితి మారాల్సిందేనని ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సూచించారు. శాఖలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోకపోతే ఎలాగంటూ చంద్రబాబు చీవాట్లు పెట్టడంతో కొల్లు నోట మాట రాలేదు. ఇక రాత్రి వేళ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ జారీ చేసిన ఆదేశాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న గనుల శాఖ మంత్రి పీతల సుజాతను ఆయన నిలదీశారు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఉచిత ఇసుకకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెప్పారు. మరింత సేపు ఇసుక తవ్వుకుంటామంటే వచ్చే ఇబ్బంది ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు. అయినా ఇసుక వ్యవహారంలో పోలీసులకు ఏం పని అని ఆయన పీతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News