: రెండున్నర గంటల్లో 475 ప్రశ్నలు... కోర్టు బోనులో వలవలా ఏడ్చిన యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న బీఎస్ యడ్యూరప్ప సీబీఐ కోర్టులో ప్రశ్నల పరంపరను తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. తనను ఇంతగా ఇబ్బంది పెట్టవద్దని ప్రాధేయపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన గనుల స్కాంపై జరుగుతున్న విచారణలో భాగంగా కోర్టుకు ఆయన హాజరు కాగా, ఈ ఘటన జరిగింది. రెండున్నర గంటల వ్యవధిలో ఆయన్ను కోర్టు 475 ప్రశ్నలు అడిగింది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రేరణా ట్రస్ట్ కు రూ. 20 కోట్ల నిధులు అందుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కేసులో భాగంగా మరింకేదైనా చెప్పాలని అనుకుంటున్నారా? అని న్యాయమూర్తి అడుగగా, ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తానే తప్పూ చేయలేదని స్పష్టం చేస్తూ, చట్ట పరిధిలోనే పాలన జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే పని చేయలేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులను ఎదుర్కొన్నారా? అని ప్రశ్నించగా, ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రేరణా ట్రస్ట్ కు సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీ నుంచి రూ. 10 కోట్లు వచ్చినట్టు అక్రమ గనులపై విచారించిన లోకాయుక్త జూలై 2011లో నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News