: ఐఎస్ఐఎస్ ఆలోచనా విధానాన్ని హిడెన్ కెమెరాతో చిత్రీకరించిన జర్నలిస్టు

జర్నలిజం వృత్తిని చిత్తశుద్ధితో నిర్భయంగా ప్రజాశ్రేయస్సు కోసం చేసే పవిత్రమైన కార్యంగా భావించే జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. ఫ్రాన్స్ లోని ఓ జర్నలిస్టు అలాగే ప్రాణాలకు తెగించి, హిడెన్ కెమెరాతో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల సంభాషణలు, ఆలోచనా విధానాన్ని చిత్రీకరించి, 'అల్లా సోల్జర్స్' పేరుతో డాక్యుమెంటరీగా ప్రదర్శించేందుకు సిధ్ధమయ్యాడు. ఫ్రాన్స్ కు చెందిన రామ్ జీ అనే జర్నలిస్టు అసలు యువకులు ఐఎస్ఐఎస్ పట్ల ఎందుకు? ఎలా? ఆకర్షితులవుతున్నారో తెలుసుకోవాలని భావించాడు. అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. సోషల్ మీడియాను ఉపయోగించి ఐఎస్ఐఎస్ సానుభూతి పరులతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ గ్రూప్ ను తొలిసారి ఫ్రాన్స్ లోని చాటె అరెక్స్ పట్టణంలో కలుసుకున్నాడు. ఆ గ్రూప్ లో 12 మంది సభ్యులు, ఒక పెద్ద ఉన్నారు. తొలిసారి రామ్ జీ వారిని కలుసుకున్నప్పుడు అబూహమ్జా ప్రదేశంలో మానవబాంబు దాడి చేయాలని కోరారు. ఆ క్షణంలో వారి సంభాషణల్లో వారికి కనిపించింది ఒక్కటే... ఈ సమాజాన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనేది! అది ఇస్లాంకు పూర్తి వ్యతిరేకం. ఇస్లాంను ఆచరించే వ్యక్తి ఇలా ఆలోచించడు అని రామ్ జీ అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత రెండో సమావేశం ఓ మసీదు వద్ద ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పక్కనే ఉన్న ఎయిర్ పోర్టులోని విమానాలను రాకెట్ లాంఛర్లతో పేల్చివేయాలని సమాలోచనలు చేసుకున్నారు. ఆ గ్రూప్ పెద్ద ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్తుండగా టర్కీ పోలీసులకు పట్టుబడి ఐదు నెలలు జైలు జీవితం అనుభవించాడు. శిక్ష పూర్తయిన తరువాత ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ తో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నారు. ఆ తరువాత జనవరిలో చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడులకు దిగి 12 మందిని పొట్టనబెట్టుకున్నది ఈ గ్రూప్ లోని ఇద్దరు వ్యక్తులేనని ఆయన తెలిపాడు. తను రహస్యంగా చిత్రీకరించిన సంభాషణలతో అల్లా సోల్జర్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీని తయారు చేశానని, ఫ్రాన్స్ లో నేడు దానిని ప్రదర్శించనున్నానని ఆయన తెలిపారు.

More Telugu News