: ఐదేళ్ల తరువాత సోషల్ మీడియాలో లాడెన్ హత్యోదంతంపై సీఐఏ ట్వీట్లు!

ఆల్ ఖైదా అధినేతగా అమెరికాను వణికించిన ఒసామా బిన్ లాడెన్ హతమై నేటికి ఐదేళ్లు పూర్తైంది. 2011 మే 2న పాకిస్థాన్ లోని అబాటోబాద్ లో ఆర్మీ క్షేత్రాన్ని ఆనుకున్న ఉన్న రెస్ట్ హౌస్ లో అమెరికా సీల్స్ వీరోచితంగా ప్రవేశించి, క్షణాల్లో లాడెన్ ను మట్టుబెట్టి శవాన్ని తీసుకువచ్చి సముద్రంలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి ఆపరేషన్ వివరాలను సీఐఏ మరోసారి తాజాగా ట్వీట్ చేసింది. ఈ ఆపరేషన్ వివరాలు అమెరికా సోషల్ మీడియాలో రీట్వీట్లతో దూసుకుపోతున్నాయి. నాడు ఆపరేషన్ 'నెఫ్ట్యూన్ స్పియర్' పేరుతో అమెరికా సీల్స్ విశాలమైన కాంపౌండ్ కలిగిన అబోటాబాద్ లో లాడెన్ ఇంటిపై హెలికాప్టర్ తో దిగడం, వాయువేగంతో ఒక్కక్కరిని మట్టుబెట్టుకుంటూ లోపలికి వెళ్లడం, మూడవ అంతస్తులో ఉన్న లాడెన్ ను మట్టుబెట్టి తీసుకెళ్లిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రాలతో సహా ట్విట్టర్ లో సీఐఏ మరోసారి వివరించింది. దీంతో అమెరికన్లు తమ కమెండోల వీరోచిత పోరాటాన్ని ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో అల్ ఖైదాను చావుదెబ్బతీసిన ఘటనపై తాజాగా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు మండిపడుతున్నారు.

More Telugu News