: దిగ్గజాలు నష్టాల్లోకి జారిన వేళ, దూసుకెళ్లిన చిన్న కంపెనీలు!

లార్జ్ క్యాప్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోయిన వేళ, చిన్న, మధ్య తరహా కంపెనీల ఈక్విటీలు లాభాల్లో పరుగులు పెట్టాయి. సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోగా, స్మాల్, మిడ్ క్యాప్ సెక్టార్లలో నూతన కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 169.65 పాయింట్లు పడిపోయి 0.66 శాతం నష్టంతో 25,436.97 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 43.90 పాయింట్లు పడిపోయి 0.56 శాతం నష్టంతో 7,805.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 121 పాయింట్లు పెరిగి 1.10 శాతం, స్మాల్ క్యాప్ 43.27 పాయింట్లు పెరిగి 0.39 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 20 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. గెయిల్, హిందాల్కో, బీహెచ్ఈఎల్, అరవిందో ఫార్మా, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,728 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,283 కంపెనీలు లాభాల్లోను, 1,329 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 97,13,919 కోట్లకు చేరుకుంది.

More Telugu News