: మూడేళ్లు దాచిన మృతదేహానికి బంగారు పూత... గురువును దైవంగా కొలుస్తున్న శిష్యులు!

రాతి శిల్పాలను పూజించడం, బతికున్న వారిని భగవంతుడిగా నమ్మి పూజలు చేయడం, మరణించిన వారి సమాధులనే దేవాలయాలుగా మలచుకోవడం వంటి వన్నీ మనకు తెలుసు. కానీ, ఓ గొప్ప గురువు మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆయన శిష్యులు సరికొత్త పద్ధతిలో ఆయన్ను తిరిగి తమ గుండెల్లో పదిలపరచుకున్నారు. మృతదేహాన్ని మూడేళ్ల పాటు దాచి, ఆపై దానికి బంగారు పూత పూసి, విగ్రహంగా మలచుకుని పూజలు మొదలు పెట్టారు. దక్షిణ చైనాలోని చాంగ్ ఫూ దేవాలయంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే... ఫూహోయ్ అనే బాలుడు తన 13వ ఏట బౌద్ధ భిక్షువుగా మారి, ధర్మ సూత్రాలను బోధిస్తూ, మంచి పేరు తెచ్చుకున్నారు. 94 సంవత్సరాల పాటు చాంగ్ ఫూ దేవాలయంలోనే గడిపిన ఆయన, 2012లో మరణించగా, శోకతప్తులైన ఆయన శిష్యులు ఓ నిర్ణయానికి వచ్చి, మృతదేహాన్ని మమ్మీగా మార్చే క్రమంలో రసాయనాలు పూసి, మూడేళ్ల పాటు కూర్చున్న భంగిమలో ఓ కుండలో ఉంచారు. ఓ రహస్య ప్రదేశంలో దాన్ని ఉంచి, ఈమధ్యే బయటకు తీసి బంగారంతో పోత పోశారు. ఇప్పుడు ఫూ హోయ్ విగ్రహం ధగధగా మెరుస్తుండగా, అక్కడే పూజలు నిర్వహిస్తూ, దేవుడని కొలుస్తూ, ఆయనపై ఉన్న తమ భక్తిని చాటుకుంటున్నారు.

More Telugu News